హోమ్ / సభా మందిరం
తెలంగాణ సారస్వత పరిషత్తు
సభా మందిరం
సాహిత్య సభలకు, సాంస్కృతిక సమావేశాలకు వేదిక.
డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరం
తొలినాళ్ళలో పరిషత్తు తన ప్రాంగణంలో సాధారణ స్థాయిలో కళామందిరాన్ని నిర్మించింది. క్రమక్రమంగా దీనికి తెరలు, మైకులు, లైటింగ్ వంటి సదుపాయాలు సమకూర్చింది. ఏ.సి. కూడా అమరింది. ప్రధాన కళామందిరంలో 250 మంది పై అంతస్తులో 100 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు సౌకర్యం ఉంది. పరిషత్తు ఆరంభ దశ నుంచి దాని ప్రగతికి అనేక విధాల సేవలందించిన డా. దేవులపల్లి రామానుజరావు గారి గౌరవార్థం పరిషత్తు కళామందిరానికి ఆయన పేరు పెట్టింది. పరిషత్తు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో నిర్వహిస్తుంది. కొన్ని సాంస్కృతిక సంస్థల వారు కూడా ఈ కళామందిరంలో కార్యక్రమాలు జరిపేందుకు పరిషత్తు వీలుకల్పించింది. నిర్వహణ ఖర్చుల క్రింద నాలుగు గంటల సమయానికి రూ.2,000 వసూలు చేస్తుంది.
పరిషత్తు భవనాలు
పరిషత్తు 1951లో తిలక్‌రోడ్‌లో రెండు గదులలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నది. క్రమంగా దీనిని పెంచుతూ వచ్చింది. ఇప్పుడు రెండంతస్తుల భవనం, కళామందిరం, కార్యాలయానికి, అటెండర్‌కు వసతి ఉన్నాయి. పరిషత్తు ఆస్తుల వ్యవహారం చూచేందుకు 22-12-1971 తేదీన ట్రస్టు ఏర్పాటయింది. పరిషత్తుకు స్థలం సమకూర్చటంలో డా. బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ కొండా వెంకట రంగారెడ్డి, శ్రీ మందుముల నరసింగరావు, శ్రీ దామోదరం సంజీవయ్య తదితర ప్రముఖుల తోడ్పాటు మరువరానిది. వీరితోపాటు శ్రీ పర్రా వెంకటేశ్వరరావు, శ్రీ మాడేటి రామప్ప, డా. కె.వి. రమణ ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) ప్రత్యక్ష సహకారం కూడా గణనీయం. అప్పటి సాంస్కృతిక విజ్ఞానశాస్త్ర వ్యవహారాల కేంద్రమంత్రి డా. హుమాయూన్ కబీర్ భవనానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హైదరాబాద్ నగర పాలక సంస్థ, కొన్ని పారిశ్రామిక సంస్థలు, కొందరు మహనీయులు ఆర్థిక సహకారం అందించారు. భవన నిర్మాణం త్వరితగతిన సాగటంలో అప్పట్లో పరిషత్తు అధ్యక్షులు శ్రీ నూకల నరోత్తమరెడ్డి, కార్యదర్శి డా. దేవులపల్లి రామానుజరావుగార్ల అవిరళ కృషి దోహదం చేసింది. అదనపు గదుల నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యులుగా వున్న డా. సి. నారాయణరెడ్డి గారు తమ ఎం.పి. ల్యాడ్స్ నిధుల నుంచి పరిషత్తుకు రూ.25 లక్షల సహాయం అందించారు.