హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

విద్యా సంస్థలు

భాషాభ్యసనానికి, ఉపాధ్యాయ శిక్షణకు వేదిక.

ప్రాచ్య కళాశాల

తెలుగు వికాసకృషిలో భాగంగా పరిషత్తు 10-8-1968 తేదీన ప్రాచ్య కళాశాలను ప్రారంభించింది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధమై, ఆ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన కళాశాల. ఈ కళాశాల సిబ్బంది జీతాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా ఇది ఎయిడెడ్ కళాశాల. ఇందులో భాషాభ్యాసం చేసిన తగిన ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలున్నాయి. ఈ కళాశాలలో మూడు కోర్సులున్నాయి. ఇవి 1. పి.డి.సి. (ప్రి-డిగ్రీ కోర్సు) — 2 సంవత్సరాలు 2. బి.ఎ. (ఎల్) — 3 సంవత్సరాలు 3. ఎం.ఎ. (ఎల్) — 2 సంవత్సరాలు. పరిషత్తు నిర్వహించే విశారద ఉత్తరభాగం పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ప్రాచ్య కళాశాల పి.డి.సి.లో చేరేందుకు అర్హులు.

కళాశాలలో ప్రతి సంవత్సరం సుమారు 300 మంది అభ్యర్థులు ప్రవేశం పొందుతారు. కళాశాల ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. చాలామంది ఎం.ఎ. (ఎల్) విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించి స్వర్ణపతకాలు పొందినారు. ఈ కళాశాలవారిగా నెలవంక అనే సంచికను వెలువరించారు.

తెలుగు పండిత శిక్షణ కళాశాల

పరిషత్తు నిర్వహిస్తున్న తెలుగు పండిత శిక్షణ కళాశాలలో శిక్షణ పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో వివిధ విద్యాసంస్థలలో ఉపాధ్యాయులుగా నియామకాలు పొంది జీవించేవారని చెప్పుకోవడం హర్షణీయం. ఈ కళాశాల 22-10-1964 తేదీన ప్రారంభమయింది. ఈ శిక్షణ కోర్సులో చేరేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విద్యార్హతలు — పి.డి.సి., విశారద, 3 ఐచ్చికాంశాలలో ఆధునిక భాష తెలుగు ఐచ్చికాంశంగా బి.ఎ., బి.ఎ. (ఎల్) తెలుగు, ఎం.ఎ. (తెలుగు), ఎం.ఎ. (ఎల్) తెలుగు.

ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష (ఎల్.పి. సెట్)లో ఉత్తీర్ణులైన వారికి ఈ కళాశాలలో శిక్షణకు ప్రవేశం లభిస్తుంది. ఉపాధ్యాయ విద్యా వ్యవహారాల జాతీయ మండలి (ఎన్.సి.టి.ఇ.) నిర్దేశించిన ప్రకారం కళాశాల శిక్షణ ప్రణాళికను అమలు పరుస్తున్నది. ఈ మండలి ప్రాంతీయ కార్యాలయం బెంగుళూరులో ఉన్నది. శిక్షణకు నిర్ణయించిన పాఠ్యప్రణాళిక చాలా సమగ్రంగా రూపొందించబడినందున అభ్యర్థులు సమర్థులైన ఉపాధ్యాయులుగా రూపొందటం గమనార్హం.

కళాశాల పూర్వ పత్రాలు

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top