హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

మా చరిత్ర

అక్షరాస్యత నుంచి సాహిత్య వికాసం వరకు — పరిషత్తు ప్రయాణం.

తెలంగాణ సారస్వత పరిషత్తు

సువిశాల గణతంత్ర భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావంతో ఈ ప్రాంత ప్రజలందరి హృదయాలలో అనిర్వచనీయానందం వెల్లివిరిసింది. ప్రత్యేక అస్తిత్వం కోసం, సమగ్రాభివృద్ధి అవకాశాల కోసం అన్ని వర్గాల వారు దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో వివిధ రూపాలలో సాగించిన అసాధారణ ఉద్యమ ఫలితమే ఈ నూతన రాష్ట్రావతరణ.

ఈ ప్రాంత ప్రధాన భాష తెలుగు. అయినప్పటికీ పెక్కు భాషలకిది ఆత్మీయనిలయంగా భాసించింది. చరిత్రను ఒకమారు పరిశీలిస్తే తెలుగు భాషా పరిరక్షణ కోసం గతంలో సర్వవిధాల కృషి ఆవశ్యకమైన సత్యం వ్యక్తమవుతుంది. ఎన్నో సంస్థలు ఈ భాషా క్రతువులో పాల్గొన్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్తు పూర్వనామం ఆంధ్ర సారస్వత పరిషత్తు. తెలుగు భాషా సముద్ధరణకు అంకితమైన ఉత్తమ సంస్థ ఇది. ఈనాడు తెలంగాణలో తెలుగు భాషా సాహిత్య కళా సంస్కృతుల వికాసాభ్యుదయాలకై నిర్విరామ కృషి చేస్తున్న అగ్రగణ్య సంస్థగా తెలంగాణ సారస్వత పరిషత్తు గణతికెక్కింది.

పరిషత్తు ప్రారంభాన్ని, క్రమాభివృద్ధిని సంక్షిప్తంగా పరిశీలించడం ఈతరం వారికి, భావితరాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ సమున్నత వారసత్వాన్ని కొనసాగించటానికి దోహదకారి అవుతుంది.

ఆవిర్భావం

దేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషలలో ద్వితీయ స్థానం అలంకరించిన భాష తెలుగు. పూర్వం హైదరాబాద్ సంస్థానంలో తెలుగు పట్ల కొందరు పాలకులు ఆదరాభిమానాలు ప్రదర్శించినమాట వాస్తవమే. ముఖ్యంగా కుతుబ్ షాహీల ప్రోత్సాహం చిరస్మరణీయంగా నిలుస్తుంది. వీరి పాలనాకాలంలో తెలుగులో కావ్యాలు విరచితమయ్యాయి. తెలుగు సాహిత్యం సుసంపన్నమయింది. కాని ఆ తర్వాత పాలకులుగా వచ్చిన రాజవంశాల ఏలుబడిలో తెలుగు నిరాదరణకు గురైంది. అసఫ్ జాహీ రాజవంశం వారికి తెలుగు భాష పైన ఎలాంటి గౌరవభావం లేదు. ఉర్దూ రాజభాష. సంస్థానంలోని తక్కిన భాషలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. పాలనా యంత్రాంగం కూడా తెలుగు వాడుకను నిర్లక్ష్యం చేసింది. అంతేకాదు ఈ భాషను అణగద్రొక్కడానికి సైతం వెనుకాడలేదు. బహుశా ప్రభుత్వ యంత్రాంగం ప్రేరణపై కావచ్చు ఒకానొక సందర్భంలో సోదర భాషకు చెందిన కొందరు వ్యక్తులు తెలుగును, వారి భాషను కించపరచటం విస్మయం కలిగిస్తుంది. ఈ సంఘటన తెలుగు ప్రజల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేదిగా వుందని కొందరు తెలుగు ప్రముఖులు నిశ్చితాభిప్రాయం. ఈ పరిణామాలతో తెలుగు వైభవాన్ని పునరుద్ధరించేందుకు వారు కంకణబద్ధులైనారు.

తెలుగు భాష పునరుజ్జీవనానికి వారు శ్రీకారం చుట్టారు. కొన్ని సంస్థలు ఆవిర్భవించాయి. పరిశోధన కేంద్రాలు రూపు దాల్చాయి. ఎన్ని ఆపాంతరాలు ఎదురైనా ఈ దిశగా పురోగమించేందుకు ఆ తెలుగు ప్రముఖులు వెనుకాడలేదు. తెలుగుభాష, సాహిత్యం, కళలు, సంస్కృతులను పునరుద్ధరించి అభివృద్ధి పరచేందుకు ఒక ప్రత్యేక సంస్థ అవసరమని వారు భావించారు. ప్రముఖులతో ఒక సమావేశం నిర్వహించారు.

హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ గ్రంథాలయం దీనికి వేదికగా ఉపకరించింది. శ్రీ లోకనంది శంకరనారాయణ రావు ఈ సభకు అధ్యక్షత వహించారు. శ్రీ బూర్గుల రంగనాథరావు, శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు సమావేశకర్తలుగా వ్యవహరించారు. తెలుగు అభ్యుదయానికి తీసుకోవలసిన చర్యలను గురించి విస్తృతంగా చర్చించారు. ఈ వేదికపైనే తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా నిలిచే నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే పేరుతో 1943 మే 26వ తేదీన ఒక మహాసంస్థ రూపుదిద్దుకున్నది.

ఈ పరిషత్తుకు నియమ నిబంధనలు రూపొందించే నిమిత్తం దిగువ పేర్కొన్న ఆదర్శమూర్తులతో ఉపసంఘం ఏర్పాటయింది. శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ బుక్కపట్నం రామానుజాచారి, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ లోకనంది శంకరనారాయణరావు, డా. బూర్గుల రామకృష్ణారావు, శ్రీ చిదిరెమఠం వీరభద్ర శర్మ, శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, శ్రీ నందగిరి వెంకటరావు, శ్రీ కోదాటి నారాయణరావు, శ్రీ గడియారం రామకృష్ణ శర్మ, శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు. ఆరంభంలో గోల్కొండ పత్రిక కార్యాలయం పరిషత్తుకు కార్యస్థానంగా ఉండేది. తర్వాత పరిషత్తు కార్యాలయాన్ని హనుమాన్ టేకిడి ప్రాంతానికి మార్చారు. క్రమేణా పరిషత్తు కార్యక్రమాలు విస్తృతమైనాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా పరిషత్తు తన కార్యక్రమాలను నిర్వహించే స్థాయి సంతరించుకున్నది. నిజాము విమోచన తర్వాత 1949 ఫిబ్రవరిలో తూప్రాన్‌లో జరిగిన పరిషత్తు సభలో నిజాం రాష్ట్ర అనే మాటలను నిర్వాహకులు తొలగించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు ఖరారైంది.

నిత్యస్మరణీయులైన ఎందరో మహానీయుల అవిరళ కృషి ఫలితంగా పరిషత్తు కార్యకలాపాలు, కార్యపరిధి అనతికాలంలోనే విస్తృతమయ్యాయి.

ముఖ్య లక్ష్యాలు

  • ప్రజానీకంలో అక్షరాస్యత, తెలుగు భాష వ్యాప్తి.
  • తెలుగులో పరీక్షల నిర్వహణ.
  • ప్రామాణిక గ్రంథ ప్రచురణ.
  • సభలు, సమావేశాలు, సమ్మేళనాల నిర్వహణ.
  • ప్రజలలో సాహిత్యాభిరుచి, ఆసక్తి పెంపుదల.
  • తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతుల సమగ్ర వికాసం.

పరిషత్తును ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దటంలో పూర్వ నిర్వాహకుల బృహత్తర కృషి ఈ సందర్భంలో ప్రస్తావించటం ఎంతో సముచితం.

శాఖలు

అక్షరాస్యతా వ్యాప్తికి, తెలుగుభాష, సాహిత్య కళా సాంస్కృతిక రంగాల వికాసానికి నిబద్ధతతో పరిషత్తు చేస్తున్న కృషి వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారి హృదయాలు అందుకున్నది. ఈ కృషిలో భాగస్వాములు కావడానికి వారు సమాయత్తులైనారు. రాష్ట్రంలోను, బొంబాయి, షోలాపూర్, బీదర్, గుల్బర్గా, సేలం, బెంగళూరు, హోసూరు మొదలైన చోట్ల పరిషత్తు శాఖలు రూపుదిద్దుకోవటం ఇందుకు తార్కాణం. మారిషస్ దేశంలో ఏర్పడిన శాఖ క్రియాశీలంగా పనిచేయటంలో శ్రీ రామమూర్తి అప్పన్న తదితరుల పాత్ర ప్రశంసనీయం. వాస్తవానికి 198 పరిషత్తు శాఖలు అసాధారణ సేవలందించాయి. ఈ శాఖల నిర్వాహకులు అంకితభావంతో, బృందస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించారు. పరిషత్తు కార్యక్రమాలను బలోపేతం చేయటానికి పరిషత్తు ప్రచారకుల సేవలను వినియోగించుకున్నది. పరిషత్తు ఆశయాల సాధనలో ఈ ప్రచారకులు ఎందరో ఔత్సాహికులకు గొప్ప ప్రేరణను కలిగించారు. వీరితోపాటు సామాన్య ప్రజలు పరిషత్తు కృషిని ప్రశంసిస్తూ స్వచ్ఛందంగా సహకారం అందించారు. పరిషత్తు శీఘ్ర పురోగతికి ఇవన్నీ దోహదకారులైనాయి.

మహాసభలు

పరిషత్తును శక్తిమంతం చేయటంలో మహాసభల భావన ఎంతగానో తోడ్పడింది. ఆది నుంచి పరిషత్తు కార్యకలాపాలు ఉద్యమ గతిలో సాగినాయి. పరిషత్తు మహాసభలు వివిధ ప్రాంతాలలో నిర్వహించారు. ఈ మహాసభలు ప్రజలలో కొత్త స్ఫూర్తిని కలిగించి తెలుగు వైభవాన్ని పునరుద్ధరించేందుకు వారిని కృతనిశ్చయులను చేసినాయి. ఈ మహాసభలు సర్వసభ్య మండలి వార్షిక సమావేశాల రూపంలో జరిగినాయి. ప్రజలందరి సహకారానికి, భాగస్వామ్యానికి ఇది దోహదకారి అయింది. పరిషత్తు శక్తి సముపార్జితం కావటానికి, కార్యక్రమాలను వినియోగించేందుకు ఇది మార్గం సుగమం చేసింది. మహాసభలను దిగువ తెలిపిన చోట్ల పరిషత్తు నిర్వహించింది.

మహాసభప్రాంతంతేదీలు
మొదటి మహాసభహైదరాబాద్1-6-1943
రెండవ మహాసభవరంగల్29, 30-12-1944
మూడవ మహాసభనల్గొండ15, 16, 17-3-1946
నాల్గవ మహాసభమహబూబ్‌నగర్5, 6, 7-3-1947
ఐదవ మహాసభతూప్రాన్ (మెదక్)4, 5, 6-2-1949
ఆరవ మహాసభమంచిర్యాల (ఆదిలాబాద్)19, 20, 21-4-1950
ఏడవ మహాసభఅలంపురం (మహబూబ్‌నగర్)11, 12, 13, 14-1-1953

వయోజన విద్య

అక్షరాస్యతా కార్యక్రమం వల్ల పరిషత్తుకు అపారాదరణ లభించింది. వయోజనుల కోసం హైదరాబాదులో 11 సామాజిక విద్యా కేంద్రాలను, తెలంగాణ అంతటా 64 రాత్రి పాఠశాలలను పరిషత్తు నిర్వహించింది. వీటితోపాటు బొగ్గు గనులుండే ప్రాంతాలలో 16 వయోజన పాఠశాలలను నిర్వహించింది. వీటన్నిటి ద్వారా వేలకొలది వయోజనులు అక్షరాస్యులైనారు. ఈ పథకంలోని ఆసక్తికర విషయమేమంటే తెలుగు మాతృభాష కాని వారు చాలామంది ప్రయోజనం పొందినారు.

జన సామాన్యంలో అక్షరాస్యతా వ్యాప్తికి పరిషత్తు చేపట్టిన కార్యక్రమంలో ప్రచార స్ఫూర్తి ఏమాత్రం లేదు. వాస్తవానికి పరిషత్తు కార్యక్రమాలలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దీక్షతో, సంకల్పశుద్ధితో అమలు పరచింది. పరిషత్తు ప్రతినిధులు 1950 డిసెంబరు మాసంలో జబల్‌పూర్‌లో వయోజన విద్యపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

పరిషత్తు ఈ దిశగా చేసిన కృషిని శ్లాఘిస్తూ సదస్సు నిర్వాహకులు పరిషత్తుకు ప్రత్యేకాహ్వానం పంపారు. హైదరాబాదులో 1950 జూన్ 15 నుంచి 30 వరకు పరిషత్తు శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరానికి శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించారు. మొత్తం 110 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. అన్ని శాఖలు వయోజన విద్యా వారోత్సవాలు జరిపినాయి. దీనివల్ల వయోజన అక్షరాస్యతకు విశేష ప్రోత్సాహం చేకూరింది.

తెలుగు పరీక్షలు

అక్షరాస్యతా వ్యాప్తి విస్తృత ప్రాతిపదికపై సాగింది. ఈ పథకానికి మరింత ప్రామాణిక రూపం సమకూర్చటం కోసం పరిషత్తు తెలుగు పరీక్షలు నిర్వహించే నిమిత్తం ఉత్తమ ప్రణాళికను రూపొందించింది. అప్పటి నుంచి నేటి వరకు తెలుగు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా పాఠశాలలో చదివే అవకాశం లేని అభ్యర్థుల పరీక్షలు ఎంతో మేలు చేకూర్చినాయి. పరిషత్తు పరీక్షలు మూడు స్థాయిలలో నిర్వహింపబడుతున్నాయి. అవి (1) ప్రాథమిక (2) ప్రవేశ (3) విశారద (పూర్వోత్తర భాగాలు). తెలుగు పండితుల నియామకానికి విశారద పరీక్షలో ఉత్తీర్ణతను ప్రభుత్వం ఒక అర్హతగా పరిగణిస్తూ లోగడ ప్రభుత్వ ఉత్తర్వులిచ్చింది.

అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణతను సెకండ్ క్లాస్ భాషా పరీక్షతో సమానమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చాలా సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాలలోను, మారిషస్ దేశంలోను ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వయఃపరిమితి నిబంధన లేదు. ఈ పరీక్షలు 187 కేంద్రాలలో నిర్వహించిన సందర్భాలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం సూచనల మేరకు విశారద ఉత్తర పరీక్ష ఉత్తీర్ణానికి 4వ ప్రశ్నపత్రంలో పాఠ్యాంశంగా 1999 అక్టోబర్ నుంచి ఎస్.ఎస్.సి. ఇంగ్లీషు పాఠ్యగ్రంథాన్ని చేర్చింది.

పరిషత్తు — భాషా విద్యా ఉద్యమం

1949 జనవరిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు హైదరాబాద్ నగర సమీపంలోని తూప్రాన్‌లో జరిగాయి. ఆ సభలలో మెట్రిక్ వరకు మాతృభాషలలో విద్యా బోధన జరగాలని, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంటర్, డిగ్రీ తరగతులలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు ద్వితీయ భాషలుగా ఉండాలని తీర్మానాలు జరిగాయి. ఈ తీర్మానాలు అమలు పరచడానికి జరిగిన ప్రయత్నంలో పరిషత్తు సంఘానికి ఆచార్య తణికెళ్ళ వీరభద్రుడు అధ్యక్షులు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, మధిరాజు హనుమంతరావు, నూకల నరోత్తమరెడ్డి సభ్యులు, దేవులపల్లి రామానుజరావు కార్యదర్శి. ఈ సంఘం సభ్యులు అప్పటి విద్యాశాఖా మంత్రిగా ఉన్న దొండే రాజ్ బహద్దూర్‌ని కలుసుకొని తమ కార్యం నెరవేర్చుకున్నారు. ఉర్దూ భాషతో పాటు అధిక సంఖ్యాక ప్రజల మాతృభాషలైన తెలుగు, మరాఠీ, కన్నడకు కూడా స్థానం కల్పించారు. దీనికి వ్యతిరేక ఆందోళనలు ఎక్కువగా జరగలేదు. ప్రజాబలం కలిగిన ఉద్యమాలకు స్థానమే కాని తిరస్కారం ఉండదు.

ఈ మార్పుతో తెలంగాణలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం తక్షణ సమస్య అయింది. అప్పుడు పరిషత్తు ముందుకు వచ్చి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను ప్రారంభించింది. గ్రామాలలో పరీక్షా కేంద్రాలను స్థాపించి పరీక్షలను నిర్వహించింది. బూర్గుల రామకృష్ణారావు, తర్వాత ఫూల్‌చంద్ గాంధీ విద్యామంత్రులుగా ఉన్న కాలమది. పరిషత్ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగాను, విశారదలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులుగాను నియమించుకోవచ్చుననే ఉత్తర్వులు జారీ అయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పరిషత్తు ప్రారంభించిన సేవలను బూర్గుల రామకృష్ణారావు ప్రశంసించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలు తెలంగాణ సమాజంలో కొత్త కళను వ్యక్తీకరించాయి. ఆ రెండు మూడు రోజులు భవనం జనంతో నిండిపోయేది. విశాలహృదయులైన భాషాభిమానులు వందలాది సారస్వత సేవకులకు భోజనాలు ఏర్పాటు చేయడం, నిద్రలు లేకుండా తెల్లవార్లు కవితా పఠనం జరుగుతూ ఉండడం ఇప్పటికీ మరువలేనిది.

ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులకు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రప్రభుత్వం ఆధీనం నుంచి తప్పించి హిందీ బోధనా కేంద్రంగా చేసి కేంద్ర ప్రభుత్వ పరం చేయాలనున్నారు. ఈ వింత చర్యకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన సంఘానికి దేవులపల్లి రామానుజరావు గారిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సంఘం అప్పటి ప్రధాని నెహ్రూ, విద్యామంత్రి మౌలానా ఆజాద్‌కు నచ్చజెప్పి ఉస్మానియా మనకు తిరిగి దక్కేటట్టు చేశారు. ప్రజల భాషలకు, ప్రజా ఉద్యమానికి లభించిన గొప్ప విజయమది.

1953 జనవరిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షిక సభలు అలంపురంలో జరిగాయి. సభలను ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఆ ఉత్సాహం, ఆ కోలాహలం సాహిత్య సభలకు లభించడం అపూర్వం. మరాఠీ, కన్నడ, ఉర్దూ ప్రజల మధ్య తెలుగు సభలకు లభించిన ఆదరణ చూచి ఉపరాష్ట్రపతి హర్షం ప్రకటించారు. నిజమైన జాతీయ సమైక్యతను ఇక్కడ చూస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో సాహిత్య సభలకు ప్రభుత్వ సహకారం లభించేది. అలంపురం మహాసభలకు హైదరాబాద్ ప్రభుత్వం అయిదు వేల రూపాయలు విరాళం ప్రకటించింది. నాటి పౌర సంబంధాల ప్రసార శాఖల మంత్రి వి.బి. రాజు గారు సభలకు సంబంధించిన వాహన వసతులు, ఆహ్వానాలు, ప్రసార సామగ్రి అంతా ప్రభుత్వమే ప్రసాదించే ఏర్పాటు చేశారు.

ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ ప్రాంతంలోనే కాక ఆంధ్రప్రదేశ్ అంతటా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ, విదేశాలలోనూ తెలుగు భాషా సాహిత్య వికాసానికి చేసిన కృషి అమోఘమైనది. ఈ కృషిలో భాగంగానే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలను స్థాపించింది. ఇందలి అధ్యాపకులలో ఎక్కువ మంది డాక్టరేట్లు చేసిన వారున్నారు. ఈ కళాశాల నుంచి కూడా పి.హెచ్.డి. చేసే అవకాశం లభించింది. పరిషత్తు అప్పుడప్పుడు పండితులతో వివిధ విషయాల మీద ఉపన్యాసాలు ఇప్పించి వాటిని గ్రంథరూపంలో ప్రకటించింది. పలు గ్రంథాలకు ఆవిష్కరణ సభలు జరిపించింది. యువభారతి కార్యక్రమాలకు పరిషత్తు ఎంతగానో సహకరించింది. పరిషత్తు ప్రాంగణంలో జరిగిన ఆనాటి సభలు మరచిపోలేనివి. రసరంజని నాటక సంస్థకు పది సంవత్సరాలు ఆశ్రయమిచ్చి ఆదుకున్నది. పరిషత్తులో 15 వేలకుపైగా గ్రంథాలతో ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలను పరిశోధకులు వినియోగించుకోవడం జరుగుతున్నది.

పరిషత్తు ప్రయాణం మూడు దశలలో సాగింది. మొదటిది ప్రారంభదశ. దీనికి పునాదిరాళ్ళు వేసిన వారు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ఇతర పెద్దలు. రెండవది నిర్మాణ దశ. దీని సభలకు ప్రాణమిచ్చిన దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణశర్మ, మాడపాటి వినోద్‌కుమార్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డిగారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు సమున్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఎంతగా కృషి చేయవలసి ఉంటుందో ఒక చిన్న వ్యాసం చాలదు. వారి విశాలమైన కృషిని చిన్న వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. సి.నా.రె. కృషి ఎంతవరకు ఫలించిందో రేపోతరాలన్నా సమీక్షించాలి.

పరిషత్తు పరిరక్షణ దశలో దానిని ఆదుకున్న మహావ్యక్తి నేటి పరిషత్తు అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డిగారు. పరిషత్తు స్థలం ప్రభుత్వం నుంచి లీజుగా తీసుకున్నది అయతే అందులో కొంత స్థలానికి లీజు కాలం ముగిసింది. అందువల్ల ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో జరిగిన ఒక సభకు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి పరిషత్తు స్థలాన్ని వారికే అమ్ముకొమ్మని సి.నా.రె. సమక్షంలో వాగ్దానం చేశారు. ఈ స్థలం కొనుగోలుకు కావలసిన సొమ్ములో చాలా భాగం అంటే రూ.14 లక్షలు రెడ్డి ల్యాబ్స్ అధినేత డా. కె. అంజిరెడ్డి గారిచ్చారు. సి.నా.రె. ఆర్థిక సాహాయం ఇచ్చారు. సుమారు రూ.25,72,793 ప్రభుత్వానికి చెల్లించి ఆ 3033 చ.మీ. స్థలాన్ని పరిషత్తు స్వాధీనం చేసుకుంది.

పరిషత్తు రజతోత్సవాలు 1973లో జరిగాయి. డా. బెజవాడ గోపాలరెడ్డి గారు ఆ సభకు ప్రారంభకులు కాగా సి.నా.రె. అధ్యక్షతగా పరిషత్తు స్వర్ణోత్సవం 1994లో వైభవోపేతంగా జరిగింది. అప్పటి భారత ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు గారు ముఖ్య అతిథిగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. పరిషత్తు వజ్రోత్సవాల సభకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. ఈ సభ జరిగిన తీరు చూసిన వారికి ఇది పరిషత్తు చరిత్రలో మరపురాని సభ అనిపించింది. అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.వి. రమణ ఐ.ఎ.ఎస్. గారు అధ్యక్షులుగా ఉన్నారు.

పరిషత్తు భవన నిర్మాణంలో మరో ఘట్టం పండిత శిక్షణ కళాశాల భవన నిర్మాణం. అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి గారు ఎం.పి. ల్యాడ్స్ నుంచి ఇచ్చిన ఇరవై అయిదు లక్షలతో పడమట విశాలమైన ఖాళీ స్థలంలో పండిత శిక్షణ కళాశాల భవన నిర్మాణం జరిగింది.

ఆంధ్ర సారస్వత పరిషత్తు తొలినాటి నుంచి ఎన్నో సాహిత్య సదస్సులు, సాంస్కృతిక సదస్సుల్లో ప్రముఖులు చేసిన ప్రసంగాల తర్వాత అవి గ్రంథాలుగా వెలువడ్డాయి. ఆ పరంపరలో పరిణతవాణి ప్రసంగాలు చెప్పుకోదగినవి.

శతాబ్దాల నుంచి కవితామృత వర్షంలో తడిసి, పచ్చబారి, చిగిర్చి, పూచి, ఫలించిన నేల తెలంగాణము. పోతన, పాల్కురికి, పిల్లలమర్రి, పిన వీరభద్రుడు, మల్లినాథసూరి, అనంతుడు, విద్యానాథుడు పుట్టిపెరిగిన మాగాణము మన తెలంగాణము. ఆంధ్రకవితా ప్రవాహం నిరంతరంగా కొనసాగుతూ వచ్చింది. తెలంగాణలో సారస్వత వికాసానికి, ప్రజా జాగృతికి ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన ఉద్యమాలు ఎంతగానో తోడ్పడినవి.

తెలుగు పరీక్షల పూర్వ పత్రాలు

పరీక్షల పాఠ్యప్రణాళిక

పరీక్షల వివరాలు

ప్రాథమిక

విశారద పూర్వ భాగం

విశారద ఉత్తర భాగం

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top